విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల అరెస్టుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(lokesh) ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం జగన్ తన బంధువుల్ని రాబందుల్లా మన్యంపైకి వదిలారని మండిపడ్డారు. ఫ్యామిలీ మైనింగ్ మాఫియా దురాగతాలు బయటపడకూడదనే ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేయించారా ? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ సొంత ఆస్తి లాగా రూ.15 వేల కోట్లు బాక్సైట్‌ని సీపీ నేతలకు కానుకగా రాసిచ్చేశారని ఆరోపించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో నిబంధనలు ఉల్లంఘించి, వేలాది చెట్లు కొట్టేసి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ ని తరలిస్తోన్న విక్రాంత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి మైనింగ్ మాఫియా కార్యకలాపాలు టీడీపీ బయటపెట్టిందని ట్వీట్ చేసారు.మైనింగ్ మాఫియా కార్యకలాపాలను టీడీపీ బయటపెట్టిందని అక్కసుతో తమ పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు.
అరెస్టు చేసిన టీడీపీ నేతలను తక్షణమే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు. బాక్సైట్ మైనింగ్ ఆపి, పర్యావరణాన్ని పరిరక్షించాలని… అలానే గిరిజనుల హక్కులు కాపాడాలన్నారు. కాగా శుక్రవారం రోజున విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాల రోడ్డును పరిశీలించేందుకు టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, రాజప్ప, కిడారి శ్రావణ్ తో పాటు మరో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు వెళ్లగా.. రౌతులపూడికి చేరుకున్న ఈ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.