పది రోజుల్లో ఇద్దరి విద్యార్థుల ఆత్మహత్యలు పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో అలజడి సృష్టించాయి. తమ సహచరుల ఆత్మహత్యలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఈ విశ్వవిద్యాలయంలో కేరళకు చెందిన 21 ఏళ్ల అగ్ని ఎస్. దిలీప్ డిజైనింగ్ విభాగంలో డిగ్రీ చదువుతున్నాడు. ఆ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషయాన్ని సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నాడు.
దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ విషాదకర ఘటనపై విశ్వవిద్యాలయం విచారం వ్యక్తం చేస్తోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దొరికిన లేఖ ఆధారంగా.. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి దర్యాప్తునకు విశ్వవిద్యాలయం అన్ని విధాలా సహకరిస్తుంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు విద్యార్థులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఆత్మహత్యను విశ్వవిద్యాలయం బయటకు రానీయడంలేదని ఆరోపించారు. రెండు ఘటనలకు గల కారణాలు తెలియాలని డిమాండ్ చేస్తున్నారు.