విజయవాడ: ఏపీలో దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసలపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జగన్ సర్కార్ పక్కదారి మల్లిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ పథకాన్ని రద్దు చేసి దళితులకు జగన్ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికైనా లోన్‌లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి జగన్ ఇంతవరకు మాటను నిలబెట్టుకోలేక పోయారన్నారు. ఇంగ్లీష్ మీడియం హైకోర్టు రద్దు చేసిందని ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి విద్య,వైద్యం అనే బాబా సాహెబ్ అంబేద్కర్ నినాదానికి జగన్ సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై దళిత మేధావులు, దళిత నేతలు నోరు విప్పాలని సూచించారు. బానిసత్వం విడనాడి, ప్రశ్నించే తత్వం దళితులలో పెరగాలని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు.