ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు మరిన్ని చిక్కులు ఎదురు కానున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లండన్ నుంచి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. పబ్లిక్ ప్లేసులకు.. పార్టీలకు తిరిగిన కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ రాగా ఆమెను లక్నో ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఆదివారం ఆమెకు కరోనా నెగెటివ్ రావడంతో ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. అయితే.. ఇంటికి డిశ్చార్జి అయినా.. మరో 14 రోజుల పాటు ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచారు. కానీ.. ఆ గడువు పూర్తయ్యాక ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తామని లక్నో పోలీసులు తెలిపారు.
కనికా కపూర్ తాను లండన్ నుంచి వచ్చిన విషయం దాటి పెట్టడంతోపాటు.. బహిరంగ ప్రదేశాలు, ఈవెంట్లకు వెళ్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. అందుకని ఆమెను హోం క్వారంటైన్ అనంతరం విచారిస్తామని.. ఆమెపై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశామని.. లక్నో పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు తమ వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని చెప్పినా కనికా కపూర్ వినలేదని.. అలాగే.. కరోనా వ్యాధిని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ.. ఈవెంట్లకు వెళ్తూ.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె ఆ వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చెందించేలా వ్యవహరించిందని.. పోలీసులు తెలిపారు. అందుకనే ఆమెను 14 రోజుల తరువాత.. హోం క్వారంటైన్ పూర్తి కాగానే అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా కనికా కపూర్‌పై లక్నోలోని సరోజినీ నగర్, హజరత్‌గంజ్, గోమ్‌తీ నగర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇక పోలీసులు ఈ కేసులను ఎలా విచారిస్తారో చూడాలి..!