అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉందనీ అన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేశామని, అన్ని రెవిన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు.
పెద్దిరెడ్డి రూ.వెయ్యి కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చాకే ఘటన జరిగింది. మొన్నటివరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉంది అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉద్యోగులు పనిచేయడం ఎందుకు? ఉద్యోగులు సక్రమంగా పనిచేయకపోతే పక్కకు తప్పుకోండి అని అన్నారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవు”అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు.