పునర్జన్మలపై మితిమీరిన విశ్వాసమే అలేఖ్య, సాయిదివ్యల హత్యకు కారణమా.. మరణించిన వారు తిరిగి బతికొస్తారన్న గుడ్డి నమ్మకమే వారిని విచక్షణ కోల్పోయేలా చేసిందా.. సత్యలోకం వస్తుందనే భ్రమలో ఉన్నలోకానికి దూరంగా ఆలోచించి కన్నబిడ్డలను కడతేర్చారా సంచలనం రేపిన మదనపల్లి జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు అలేఖ్య , సాయిదివ్యల హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తమ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజల పేరుతో తమ కుమార్తెలను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని రెండు రోజలు పాటు సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు.. తల్లిదంద్రులను నిందితులుగా చేర్చారు.
విచారణలో మృతుల తల్లిదండ్రులు చెప్పిన సమాధానాలు విని పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. తమ కూతుళ్లకు దెయ్యం పట్టిందని, అందుకే డంబెల్స్‌తో కొట్టి చంపామని చెప్పారు. దెయ్యం వదిలాక వారిద్దరూ మళ్లీ బతుకుతారంటూ వింత సమాధానాలు ఇచ్చారు. తమ ఇంట్లో కొన్ని రోజులుగా ఎన్నో మహిమలు జరిగాయని అవి మీకు చెప్పినా అర్థం కావని చెప్పుకొచ్చారు. తమ ఇంట్లో దేవుళ్లు ఉన్నారని, పూజలతోనే చిన్న కూతురు సాయి దివ్య ఆరోగ్య సమస్యలను తగ్గించామని అన్నారు.
వారం రోజులుగా అర్థరాత్రి 12 గంటలకు ఇంటి బయట ఎన్నో పూజలు చేశామని తెలిపారు. 10 రోజులుగా తిండి లేకుండా ఉన్నామని., కలియుగం నేటితో అంతం అయ్యిందని. సత్య యుగం ఇప్పుడే మొదలైందని విచారణలో వివరించారు. అంతేకాదు.. తమ కూతుళ్లు బతుకుతారు దయచేసి మీరు వెళ్లిపోండి అంటూ పోలీసులను వేడుకుంది తల్లి పద్మజ.అరెస్ట్ చేస్తున్న సమయంలో తల్లి పద్మజ వింతగా ప్రవర్తించారు. చేతుల్ని తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.
అయితే వీరు ఇంతలా హత్యలు చేయడానికి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఘటనే అనే అనుమానం బలపడుతోంది. చిన్న కూతురు దివ్య గతంలో ఒకసారి చర్మవ్యాధి వస్తే.. దాన్ని య్యూటూబ్‌లోని వీడియోలు చూసి పూజలు చేశారు..అ వెంటనే అమెకు చర్మవ్యాధి తగ్గిపోయింది ..ఇక అప్పటి నుంచి సమస్య ఏది వచ్చినా పూజలు చేయడం అలవాటుగా మార్చుకుంది పురుషోత్తం కుటుంబం. అయితే వీరి ప్రవర్తనకు మానసిక సమస్యలే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.