అడవి శేష్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో మేజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిని ఎదుర్కొనేందుకు వెళ్ళి అమరుడైన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి అడవి శేష్, ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. మేజర్ సినిమా తీద్దామని అనుమతి కోసం సందీప్ తల్లిదండ్రులని కలుసుకున్నానని, వారితో పాటు కొన్ని మీటింగులయ్యాక ఒకానొక రోజు నువ్వు నా కొడుకు కథ సినిమాగా తీస్తావని 10శాతం నమ్మకం వచ్చిందని సందీప్ గారి తండ్రి అన్నారట.
అప్పుడు 10శాతం నమ్మకం వచ్చిందని సంతోషపడాలో, 90శాతం నమ్మకం లేదని బాధపడాలో అర్థం కాలేదట. సినిమా గురించి చర్చలు ముగిసి వెళ్తున్న ఒకానొక సమయాన సందీప్ గారి అమ్మ అడవి శేష్ ని వెనక్కి పిలిచి, నువ్వు సందీప్ లాగే కనిపిస్తున్నావు అని అన్నదట. ఆ క్షణం మేజర్ సినిమాకి పూర్తి పర్మిషన్ లభించిందని అడవి శేష్ ఫిక్స్ అయ్యాడట. మేజర్ సినిమా కథ, సందీప్ గారి జీవితం ఎలా ఉండేదన్న విషయాన్ని తెలియజేస్తుందట. సందీప్ ఉన్నిక్రిష్ణన్ గారి స్పిరిట్ ని నాలో నింపుకునే ప్రయత్నమే మేజర్ అని అడవి శేష్ చెప్పుకొచ్చాడు.