దేశవ్యాప్తంగా కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వాలు కరోనాను అడ్డుకునేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే.. మరొక వైపు కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇతరుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళను దాచేందుకు ఆమె తండ్రి యత్నించాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.
ఆగ్రాకు చెందిన ఓ జంట ఇటీవలే హనీమూన్ నిమిత్తం ఇటలీకి వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఆ జంటకు బెంగళూరులో పరీక్షలు చేయగా భర్తకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతని భార్య ఆగ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లింది. అయితే ఆమెకు కచ్చితంగా కరోనా ఉండి ఉంటుందనే కారణంతో పోలీసులు వేట కొనసాగించారు. ఆగ్రాలో ఉంటున్న ఆమె తండ్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అతను తన కూతురి వివరాలు చెప్పడం ఇష్టం లేక ఆమె రైలులో బెంగళూరుకు బయల్దేరిందని అబద్దం చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు వినకుండా సోదాలు చేశారు. దీంతో ఆమె ఇంట్లోనే వాళ్లకు పట్టుబడింది. ఈ క్రమంలోనే ఆమెను హాస్పిటల్‌కు తరలించి మరోసారి కరోనా టెస్టు చేశారు. అయితే ఈసారి ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 269, 270 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా ఆ మహిళ కుటుంబం మొత్తాన్ని ఇంట్లోనే క్వారైంటన్‌లో ఉంచామని, వారిని ఆ మహిళ తాకి ఉండవచ్చని, అందుకే వారిని ఇంట్లోనే ఉంచి వారి ఆరోగ్య స్థితిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా సోమవారంతో భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 110కి చేరుకున్న సంగతి తెలిసిందే..!