పౌరసత్వ సవరణ చట్టాన్ని గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనితో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన ఎనిమిదో రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పిన విధంగానే ఆయన రాష్ట్ర శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఫిబ్రవరి 16న తెలంగాణ క్యాబినెట్ ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని ఇది భారత్ కి అంత మంచిది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారని కేసిఆర్ అన్నారు. భిన్న సంస్కృతులు గల తెలంగాణలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సీఏఏ బిల్లును తెచ్చినప్పుడు కూడా తాము వ్యతిరేకించినట్లు కేసిఆర్ గుర్తుచేశారు.