అసలే దేశంలో కరోనా చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు కరోనా దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య సదుపాయాల కొరత ఉంది. అయితే ఇలాంటి కష్టకాలంలో మానవత్వం చూపించాల్సింది పోయి కొందరు వెధవలు ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే…
చండీగఢ్‌లోని కపుర్తలకు చెందిన సచిన్ గ్రోవర్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా స్థానికులకు పరిచయం అయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్లను రూ.10వేలకు, కోవిడ్ టీకా ఒక్క డోసును రూ.4500 సరఫరా చేస్తానని నమ్మబలికాడు. నిజమే అని నమ్మిన కొందరు అతనికి డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారు. తరువాత అతనికి కాల్స్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇతను ఒక్కడే కాదు, ప్రస్తుతం చాలా మంది ఇలా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌లో పరిచయం అవుతూ ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఇతర సామగ్రిని సరఫరా చేస్తామని నమ్మిస్తూ ప్రజలకు కుచ్చు టోపీ పెడుతున్నారు. కనుక ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.