ప్రముఖ కార్ల తయారీదారు టెస్లా రూపొందించే కార్లలో ఆటో పైలట్ మోడ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అంటే.. కారును డ్రైవర్ నడిపించకున్నా.. దాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెడితే దానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. యాక్సలరేటర్‌ను ఆటోమేటిగ్గా అప్లై చేస్తుంది, బ్రేక్‌లు వేస్తుంది. కార్ దానంతట అదే వెళ్తుంది. ఈ ఫీచర్ల కోసమే టెస్లా కార్లను చాలా మంది కొంటుంటారు. ఆటో పైలట్ మోడ్ పెట్టినా మనుషుల కన్నా సేఫ్ గా కార్లు వాటంతట అవి వెళ్లగలవు. అయితే దీన్ని అదునుగా తీసుకున్న ఓ టెస్లా కారు డ్రైవర్ కారును ఆటో పైలట్ మోడ్ లో పెట్టి నిద్రపోయాడు. కారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అయితే చివరకు పోలీసులు కారును ఆపి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్స్‌లో ఉన్న పొనొకా అనే టౌన్ వద్ద పైన తెలిపిన సంఘటన చోటు చేసుకుంది. టెస్లా కారులో ఉన్న ఆటో పైలట్ మోడ్‌ను 20 ఏళ్ల ఓ డ్రైవర్ ఆన్ లో ఉంచాడు. అనంతరం అందులో నిద్రించాడు. తరువాత కారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. కానీ ఆ దారిలో వాహనాల్లో ప్రయాణించాల్సిన గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు మాత్రమే. అందువల్ల ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకు ఆ డ్రైవర్‌ను పోలీసులు ఆపి అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.
మన దేశంలో ఓవర్ స్పీడ్‌కు జరిమానాతో సరిపెడతారు. కానీ కెనడాలో చాలా తీవ్రమైన శిక్ష విధిస్తారు. కారును ఆటో పైలట్ మోడ్‌లో ఉంచినా సరే దాన్ని గరిష్ట స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్‌తోనే నడపాలి. కానీ రూల్స్‌ను పాటించనందుకు ఆ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.