స్మార్ట్ ఫోన్లు అన్నాక అవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయానికి పాడవుతుంటాయి. వాటిలో అనేక సమస్యలు వస్తుంటాయి. దీంతో కొందరు రిపేర్ చేయించుకుని వాటిని వాడుతారు. కొందరు పాత వాటిని అమ్మేసి కొత్త ఫోన్లను కొంటారు. అయితే కొత్త ఫోన్ కొన్నాక కొద్ది రోజులకే పని చేయకుండా పోతే చిర్రెత్తుకొస్తుంది కదా. కంపెనీలు కూడా బాగు చేసి ఇస్తామంటాయే తప్ప ఫోన్లను రీప్లేస్ చేసి ఇవ్వవు. అయితే ఓ కంపెనీ కూడా అలాగే చెప్పింది. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.
ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలో ప్రహ్లాద్‌పూర్‌లో భీమ్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను స్థానికంగా ఇన్వర్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత నెల కిందట అతను ఓ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. కానీ కొన్ని కొద్ది రోజులకే ఆ ఫోన్‌లో సమస్యలు వచ్చాయి. దీంతో అతను స్థానికంగా ఉన్న ఎం2కే మాల్ కాంప్లెక్స్‌లోని సదరు ఫోన్ తయారీ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌లో ఫోన్‌ను రిపేర్ కు ఇచ్చాడు.
అయితే ఫోన్‌ను వారు రిపేర్ చేశామని చెప్పినా సమస్య అలాగే ఉంది. దీంతో అతను ఫోన్‌ను మార్చి వేరే ఫోన్ ఇవ్వాలని కోరాడు. అందుకు వారు నిరాకరించారు. కావాలంటే మళ్లీ రిపేర్ చేసి ఇస్తామన్నారు. దీంతో భీమ్ సింగ్‌కు చిర్రెత్తుకొచ్చి ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఎదుట తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో స్థానికులు వెంటనే అలర్ట్ అయి అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అతను కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.