‘దోమలు కుడుతున్నాయి. నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిటో కిల్లర్ కావాలి’ అని ఓ యువకుడు పోలీసులకు ట్వీట్ చేశాడు. దానికి పోలీసులు స్పందించి వెంటనే అతడికి.. ఓ మస్కిటో కిల్లర్‌ను తెచ్చి ఇచ్చారు. ఎల్లప్పుడు తాము ప్రజల సేవలోనే ఉంటామని నిరూపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ ఖాన్ అనే యువకుడి భార్యకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు. అదే రాత్రి ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆసుపత్రిలో విపరీతంగా దోమలు ఉన్నాయి. అవి అసద్ ఖాన్ భార్యను.. కూతురిని తీవ్రంగా కుడుతున్నాయి. దీంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్ ఖాన్.. మస్కిటో కిల్లర్ కోసం బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్ని మూసి ఉన్నాయి.
ఇక చేసేది లేక మస్కిటో కిల్లర్ కావాలని కోరుతూ యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. పోలీసులు ఈ ట్వీట్‌పై మానవీయ కోణంలో స్పందించారు. వెంటనే అసద్ ఖాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చి అసద్ ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను అందించారు.