తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్ల ఘటన ఎంత హింసాత్మకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి నెలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిచ్చు కాస్త రెండు వర్గాల మధ్య పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఆస్తి నష్టం కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఆ గొడవలు జరిగిన పట్టణంలో ఒక వ్యక్తి తుపాకీతో కనిపిస్తే ఎలా ఉంటుంది ? అమ్మో అనిపిస్తోంది కదూ..
అలాంటి ఘటనే ఈరోజు భైంసా పట్టణంలో జరిగింది. పట్టణ శివారులో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పడి పోయాడు. దీంతో అతని వద్ద ఉన్న గన్ కింద పడింది. అతని వద్ద గన్ ను చూసి భయపడిన స్థానికులు… పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. అయితే అది డమ్మీ గన్ అని చెప్పడంతో స్థానికులు అంత ఊపిరి పీల్చుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన బైక్ పై వచ్చిన ఆ వ్యక్తికి సంబందించిన పూర్తి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.