Ginna Review: మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ ఎలా ఉందంటే?

-

మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోని కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’. ఈ సినిమాకు మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం.. పాయల్‌, సన్నీ లియోన్‌ వంటి అందాల మెరుపులు తోడవడం.. వీటన్నింటికీ తోడు ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘జిన్నా’ అందుకున్నాడా? మంచు విష్ణు ఖాతాలో విజయం చేరిందా?

కథేంటంటే: చిత్తూరు జిల్లాలోని రంగం పేటకు చెందిన గాలి నాగేశ్వరరావు కథ ఇది. ఎవరైనా అతన్ని పూర్తి పేరుతో పిలిస్తే అసలు సహించడు. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’ అని పిలవమని చెబుతుంటాడు. తనకి ఊరంతా అప్పులే. అలా అప్పు చేసే, ఆ ఊళ్లో ఓ టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. దురదృష్టం ఏంటంటే అతను ఏ పెళ్లి కాంట్రాక్ట్‌ తీసుకున్నా.. అది పెటాకులవుతుంటుంది. ఈ కారణంతోనే అతని టెంట్‌ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్‌ తిప్పేస్వామి (రఘుబాబు). అదే సమయంలో ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోన్‌). తనకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు బాల్య స్నేహితురాలు. అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోతుంది. ఇన్నేళ్లకు తిరిగి ఊరికి వచ్చిన ఆమె.. వచ్చీ రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వాస్తవానికి జిన్నాకు పచ్చళ్ల స్వాతి (పాయల్‌ రాజ్‌పుత్‌) అంటే ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, రేణుకను చూశాక అతని ఆలోచన మారుతుంది. ఆమెని పెళ్లి పేరుతో బుట్టలోకి దింపి.. ఆమె డబ్బు కొట్టేసి, అప్పులు తీర్చుకొని, ఊరి సర్పంచ్‌ అవ్వాలని పథకం రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? స్వాతిని ప్రేమించిన జిన్నా.. రేణుక మెడలో తాళి కట్టాడా? సర్పంచ్‌ అవ్వాలన్న అతని కల నెరవేరిందా? ఈ క్రమంలో అతనికి రేణుక నుంచి ఎదురైన సవాళ్లేంటి? ఆమెను చూసి ఊరి వాళ్లంతా భయపడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: జిన్నా ప్రచార చిత్రాలు చూసిన ఎవరికైనా.. ఇందులో ఏదో ఓ హారర్‌ ఎలిమెంట్‌ దాగి ఉందన్న విషయం అర్థమయ్యే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ ఊహలతోనే థియేటర్లలోకి అడుగు పెడతారు. ప్రథమార్థం అంతా ఆ ఊహలకు తగ్గట్లుగానే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధంలో వచ్చే ఓ ఊహించని సర్‌ప్రైజ్‌ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అయితే అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. జిన్నాగా మంచు విష్ణు పాత్రను పరిచయం చేసిన తీరు ఓకే. ఆయన నేపథ్యాన్ని.. ఊళ్లో అతని అప్పుల గోలల్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. జిన్నాని సర్పంచ్‌గా నిలబడనీయకుండా చేయడం కోసం తిప్పేస్వామి అప్పులిచ్చిన వ్యక్తితో కలిసి వేసే ఎత్తుగడలు, ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌లు కాలక్షేపాన్నిస్తాయి. రేణుక పాత్ర ఊళ్లోకి అడుగు పెట్టాక కథలో కాస్త వేగం పెరిగినట్లు అనిపించినా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే సాగుతుంటాయి. ఆమె జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం.. అదే సమయంలో స్వాతికి జిన్నాకు మధ్య ఉన్న ప్రేమ బయట పడటం.. ఇలా కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. విరామానికి ముందు రేణుక పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌ హారర్‌ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. కానీ, ప్రీక్లైమాక్స్‌కు ముందు కథ మరో ఊహించని మలుపు తిరుగుతుంది. రేణుక పాత్ర వెనకున్న మరో కోణం.. ఆ పాత్రకు సంబంధించిన గతం థ్రిల్‌ పంచుతుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగినా.. సినిమాని ముగించిన తీరు అంతగా రుచించకపోవచ్చు. సీక్వెల్‌ కోసం కథను అలా అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: జిన్నాగా మంచు విష్ణు చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్‌ సన్నివేశాల్లో పాత విష్ణుని గుర్తు చేశారు. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ కథలో సన్నీ లియోన్‌ పోషించిన రేణుక పాత్రే ప్రధానమైంది. ప్రధమార్ధంలో మూగ, చెవిటి అమ్మాయిలా సాదాసీదాగా కనిపించే ఆ పాత్ర.. ద్వితీయార్ధంలో చాలా శక్తిమంతంగా కనిపిస్తుంది. అయితే ఇంత బరువైన పాత్రను హ్యాండిల్‌ చేయడంలో సన్నీ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. తెరపై ఆమె అందచందాలు కుర్రకారుకు గిలిగింతలు పెడతాయి. పచ్చళ్ల స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌ పరిధిమేర నటించింది. రాకేష్‌ మాస్టర్‌గా చమ్మక్‌ చంద్ర, మైసూర్‌ బుజ్జీగా వెన్నెల కిషోర్‌ పంచే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. సూర్య తనకు అందించిన కథను అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మంచు విష్ణు కుమార్తెలు పాడిన ‘ఇదే స్నేహం’ గీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కథకు చక్కగా కుదిరింది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

చివరిగా: కాలక్షేపాన్నిచ్చే ‘జిన్నా’.. ఒకసారి చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version