ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు.
1469 ఆహారపు ప్యాకెట్లు , 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.