మొదటి రెండు వన్డేలు ఓడిపోయి.. సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆఖరి మ్యాచ్‌లో భారత్ అదగొట్టింది. ఆతిథ్య బంగ్లాదేశ్ తో నేడు జరిగిన చివరి వన్డేలో 227 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 410 పరుగుల లక్ష్యసాధనలో బంగ్లాదేశ్ జట్టు 34 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, సిరాజ్ 1, కుల్దీప్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబల్ హసన్ చేసిన 43 పరుగులే అత్యధికం. బంగ్లాదేశ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు అనిపించలేదు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను 1-2తో ముగించింది. అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. యువ కిశోరం ఇషాన్ కిషన్ (210) అద్భుత డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ (113) సెంచరీ టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్స్ గా నిలిచాయి. ఇక, ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ డిసెంబరు 14న ప్రారంభం కానుంది.