మావోయిస్టు పార్టీ నుంచి తాజాగా ఒక లేఖ, ఆడియో టేప్ విడుదల అయ్యాయి. ఏవోబీలో తాజాగా జరిగిన ఎదురు కాల్పులు,ల్యాండ్ మైన్ పేలుడు పై ఈ లేఖలో మావోలు స్పందించారు. ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు గాయపడ్డారనేది పోలీసులు ప్రచారం మాత్రమేనని పిఎల్జీఏ రిక్రూట్ పై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పిఎల్జీఏ సభ్యులు గాయపడ్డారని వారిని కూడా ప్రజలే కాపాడుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రే హౌండ్స్ బలగాలు వెనకనుండి జరిపిన కాల్పుల్లో కామ్రేడ్ దయ అమరుడు అయ్యారని పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో పోలీసు బలగాలపై భౌతిక దాడులకు పాల్పడమని ముందే చెప్పామని ఆ మాటకు కట్టుబడి కష్టకాలంలో ప్రజలకు వైద్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు.
ప్రభుత్వం ఆదివాసీలను హతమార్చేందుకు పోలీస్ బలగాలు మోహరించిందని, పోలీసులు చర్యలకు ప్రతిఘటనగా జులై 19 పోలీస్ బలగాల పై బాంబ్ డంప్ పేల్చామని పేర్కొన్నారు. పెదబయలు అటవీ ప్రాంతం లో భారీగా బాంబ్ డంప్ లు పెట్టామని అటువైపుగా స్థానిక ప్రజలెవరు రావొద్దని ముందుగానే సమాచారం కూడా ఇచ్చామని లేఖలో పేర్కొన్నారు. అయితే తెలియక వచ్చిన ఇద్దరు బాంబ్ డంప్ పేలి మృతి చెందారని వారికి మా పార్టీ తరపున క్షమాపణ కోరుతున్నామని అన్నారు. అయితే దీనిని సాకుగా తీసుకొని పోలీసులు కొంతమంది గిరిజనులకు డబ్బులు ఇచ్చి విషప్రచారాన్ని చేస్తున్నారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.