ఏపీలో అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు! బాబుని నమ్మి, బాబు మాటలు నమ్మి మూడు పంటలు పండే భూములిచ్చిన రైతులు ఆవేదన చెందుతున్నారని టీడీపీ నేతలే అంటున్నారు.. వారికి న్యాయం చేయాలని రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన టీడీపీ నేతలు, వారికి న్యాయం జరిగేలా పోరాటలు చేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన టీడీపీ నేతలు… ఆ టాపిక్ మానేసి, టాపిక్ డైవర్ట్ విషయాలు మాట్లాడుతున్నారు!
ప్రస్తుతం ఏపీలో మూడురాజధానుల టాపిక్కే హాట్ టాపిక్! ఈ విషయంలో ఏపీ టీడీపీ నేతలకు, మరి ముఖ్యంగా గుంటూరు – కృష్ణా జిల్లాల నేతలకు మరింత బాధ్యత ఉందని అంటున్నారు రైతులు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నా.. ఆల్టర్నేటివ్ ఆలోచనలు చేయాలని సూచిస్తున్నా కూడా రైతులు స్పందించడం లేదు. తమ తరుపున చంద్రబాబు & కో పోరాడతారని వారు నమ్ముతున్నారు. అవసరమైతే రాజినామాలు చేసి, ఇష్యూ తీవ్రతను తెలియజేస్తారని ఆశిస్తున్నారు. కానీ… టీడీపీ నేతలు మాత్రం, ఏపీలో కరోనా తీవ్రతరమవుతుందని మాట్లాడుతున్నారు! అది కూడా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు!
ఉదాహరణకు… తాజాగా మైకందుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్… “కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. సాక్షాత్తు సీఎం వైఎస్ జగనే మాస్కు పెట్టుకోకుండా తిరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ముఖ్యమంత్రి మాస్క్ గురించి తర్వాత… ఆయన పెట్టుకుంటారా – పెట్టుకోరా అన్నది ఆయన ఆరోగ్యం పట్ల ఆయన ఆలోచించుకుంటారు! ముందు మీరంతా మా గురించి ఆలోచించండి” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!!
దీంతో… మూడు పంటలు పండే భూములను టీడీపీ నేతల మాటలు నమ్మి ఇచ్చిన రైతుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ఆ దిశగా పోరాటాలు చేయకుండా టీడీపీ నేతలు తప్పించుకుని తిరుగుతున్నారని అంటున్నారు విశ్లేషకులు!!