ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ భారీ రైతు కవాతు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను రైతులు సిద్ధం చేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు గత రెండు నెలలుగా అలుపెరుగని పోరాడం చేస్తున్న రైతు ఉద్యమం చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి తరలి వచ్చిన సంగతి తెలుస్తోంది. ఉద్యమ కొనసాగింపులో భాగంగా రైతు కవాతును ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రైతు సంఘ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటన జారీ చేశారు.
నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, గాజీపూర్ ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల వద్ద శకటాలు, ట్రాక్టర్లను ప్రదర్శిస్తున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇందులో 500 మందికిపైగా మహిళలు ట్రాక్టర్లను స్వయంగా నడుపుతాయని వెల్లడించారు. ఈ కవాతు సాఫీగా సాగేందుకు 2500 మందికిపైగా వాలంటీర్లను కూడా నియమించామని తెలిపారు. అంబులెన్స్, సహాయక బృందాలు, వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఢిల్లీ పోలీసులు 6వేల భద్రతా సిబ్బందిని నియమించింది.
మూడు దీక్షా కేంద్రాల గుండా..
దాదాపు రెండు లక్షలకుపైగా ట్రాక్టర్లతో మూడు దీక్షా కేంద్రాల నుంచి భారీ రైతు కవాతు ప్రారంభం కానుందని క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. ఉద్యమ కారులు ఆయా ప్రాంతాల నుంచి మొదలయ్యే ప్రదర్శనలకు బాధ్యత వహిస్తారన్నారు. కాగా, ర్యాలీ మూడు మార్గాల గుండా ఉంటుందన్నారు. మొదటి మార్గం సింఘూ సరిహద్దు నుంచి ఖర్ఖోడా టోల్ ప్లాజా (63 కి.మీ), రెండవది టిక్రీ సరిహద్దు నుంచి అసోడా టోల్ ప్లాజా (62 కి.మీ), మూడో మార్గం గాజీపూర్ నుంచి లాల్ ఖౌన్ (68 కి.మీ) వరకు ఉంటుందని కిసాన్ మోర్చా నేతలు వెల్లడించారు. ఈ కవాతు ఎక్కడ ప్రారంభమైందో చివరి అక్కడే ముగుస్తుందని, రైతుల సమస్యలు ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.