రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు ఒత్తిడి కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.అయితే, ఆత్మహత్యలకు గల అసలు కారణాలను కాలేజీ యాజమాన్యాలు బయటకు రానివ్వడం లేదని సమాచారం.
తాజాగా ఏపీలోని విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కాలేజీ మేడపై నుంచి దూకి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్ర వంశీ(17) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగా చదవటం లేదని లెక్చరర్ మందలించడంతోనే తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కాలేజీ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు.