మేడారం మహాజాతరకు రంగం సిద్ధం అయింది. కోట్లాది భక్తుల కొంగుబంగారంగా కొలువబడుతున్న సమ్మక్క- సారలమ్మ గిరిజన కుంభమేళా నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరుగనుంది. మారుమూల ప్రాంతం మేడారం… భక్తుల సందడితో కిక్కిరిసిపోనుంది. సాధారణ రోజుల్లో కేవలం వందల సంఖ్యలో ఉండే జనాలు.. నేటి నుంచి మెగా సిటీని తలపించే విధంగా భక్తుల సందడి మొదలుకానుంది. మేడారం పరిసర ప్రాంతాలు సమ్మక్క-సారలమ్మ దివ్య నామస్మరణంతో మారుమోగనుంది.
జాతర తొలిరోజు బిడ్డ సారలమ్మ కన్నెపెల్లి నుంచి మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటుంది. రెండో రోజు అసలైన ఘట్టం మొదలవుతుంది. రెండో రోజు తల్లి సమ్మక్క చిలకల గుట్ట నుంచి భరణి రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టనించనున్నారు. ఆరోజు నుంచే భక్తుల రద్దీ మరింత ఎక్కువ కానుంది. మూడోరోజు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు ఇద్దరూ భక్తులకు దర్శనం ఇస్తారు. నాలుగో రోజు సాయంత్ర అమ్మవార్లిద్దరిని యదాస్థానాలకు తరలిస్తారు. తెలంగాణ, ఏపీల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఓడశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మొత్తంగా కోటిన్నర మంది భక్తుల అమ్మవార్లను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.