ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం కీలక నిర్ణయం వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత… జగన్ తొలి కేబినెట్ లో హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయారు సుచరిత. ఈ పరిణామంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ సుచరిత… జగన్ వారించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తదనంతర పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు సుచరిత.
అయితే.. తాజాగా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు సుచరిత. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని కూడా తెలిపారు సుచరిత. ఇకపై తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడుకే పరిమితమవుతానని సుచరిత పేర్కొన్నారు. సుచరిత ప్రకటనపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.