భారత ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టే లక్ష్యంతో ప్రభుత్వ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో, అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చేరింది. గ్రూప్ కొనుగోళ్ల కోసం షాపింగ్ యాప్‌ను తీసుకురావడానికీ సంస్థ సన్నాహాలు చేస్తోందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ సాయంతో రిటైలర్లు, విక్రేతల నుంచి మంచి ధరలను పొందడానికి సంస్త చూస్తోంది.
తమ ఓపెన్ నెట్‌వర్క్ వినియోగదార్ల బలాన్ని వినియోగించుకోవడంతో పాటు సామాజిక కామర్స్ వంటి వినూత్న ఆలోచనలను మైక్రోసాఫ్ట్ అమలు చేయొచ్చని ఓఎన్‌డీసీ ఎండీ, సీఈఓ టి.కోషి తెలిపారు. ఇ-కామర్స్ విస్తృతికి ఓఎన్‌డీసీ వంటివి కీలకంగా మారుతాయని, యూపీఐ వంటి నెట్‌వర్క్‌లు ఇప్పటికే కొనుగోలుదార్లు, విక్రేతలకు లబ్ధి చేకూరుస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లోకి ఇప్పటికే డంజో, గో ఫ్రూగల్, పేటీఎం, డిజిట్, ఫోన్‌పే, లోడ్‌షేర్ వంటి సంస్థలు చేరాయి. ఈ నెలలో స్నాప్‌డీల్ కూడా అరంగేట్రం చేయనుంది. 2030 కల్లా దేశీయ ఇకామర్స్ విపణి 400 బి.డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి.