గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపులో పోస్టులు పార్వార్డ్ చేశారన్న ఆరోపణలతో నరేంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నరేంద్రను మొన్న రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేసిన నిన్నసాయంత్రం ఆరు గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలో… టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు అర్ధరాత్రి బెయిలు లభించింది. అయితే, అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద నరేంద్రను హాజరుపరిచారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారన్న నరేంద్ర ఫిర్యాదు నేపథ్యంలో తొలుత ఆయనకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి కె.శృతవింద.
దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య నరేంద్రను జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో తిరిగి నరేంద్రను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వైద్యుల నివేదికను న్యాయమూర్తికి అందించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం నరేంద్రకు బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.