ఆయన యువ నాయకుడు. దూకుడు ఎక్కువనే పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. ఎవరిపైనైనా విమర్శలు చేయాలంటే..ఆయన తర్వాతే. అది వివాదాస్పదమా? వివాద రహితమా? అనేది బేఖాతరు! ఆది నుంచి ఇలాగే ఉంటూ.. తనకంటూ.. ప్రత్యేకతను సంపాయించుకున్నారునెల్లూరు జిల్లా సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత మంతి అనిల్ కుమార్ యాదవ్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో దూకుడుగానేఉన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పార్టీని, పార్టీ అధినేత జగన్‌ను ఎవరైనా కామెంట్ చేస్తే.. అంతే తీవ్రంగా వారికి కౌంటర్ ఇవ్వడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనే పేరు సంపాయించుకున్నారు.
అలాంటి నాయకుడికి.. జగన్ దగ్గర కూడా మంచి యాక్సస్ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ తన కేబినెట్‌లోకి తొలి విడతలోనే అనిల్‌కు చాన్స్ ఇచ్చారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖను అనిల్‌కే అప్పగించారు. ఇంత వరకు ఓకే! అయితే, తాను మంత్రి అయినప్పటి నుంచి అనిల్ దూకుడు మరింతగా పెరిగిందని అంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. ఆయన రాజకీయంగా తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకున్నారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ ఈ వర్గం నుంచి అనేక మంది నాయకులు వైసీపీలో ఉన్నారు. వీరంతా కూడా జగన్‌కు సన్నిహితులుగానే పేరు తెచ్చుకున్నారు.
ఈ జిల్లా వైసీపీలో మూడున్నర దశాబ్దాలుగా రాజకీయం చేస్తోన్న నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరందరిని అనిల్ మూడు చెరువుల నీళ్లు తాగించేస్తున్నారు. అనిల్ దెబ్బతో వీళ్లు లోలోన రగులుతున్నా చేసేదేం లేక కక్కలేక మింగలేక ఉంటున్నారు. మంత్రి అయ్యారో లేదో అప్పటి నుంచే అనిల్ మాత్రం తన దూకుడు పెంచారు. గతంలో తన ఎదుగుదలను ప్రభావితం చేసిన రెడ్డి సామాజిక వర్గంపై కసితీర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. ఈ క్రమంలోనే తన నియోజకవర్గంతోపాటు.. జిల్లా వ్యాప్తంగా కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
వాస్తవానికి నెల్లూరులో జగన్‌కు అత్యంత సన్నిహిత వర్గమైన మేకపాటి వర్గం ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్‌కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్‌కు అండగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మేకపాటి వర్గం జగన్‌కు అండగా నిలిచింది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో మేకపాటి తన యుడు గౌతంరెడ్డికి జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే, గౌతంరెడ్డి పెద్దగా ఎవరి జోలికీ పోరు.. వేరేవారి విషయాన్ని కలుగజేసు కోరు. తన పనేంటో తాను చేసుకునిపోయే వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో రెడ్డి వర్గంపై ఆధిపత్యం సాధించేందుకు మంత్రి అనిల్ ప్రయత్నిస్తున్నారనే వాదన ఉంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-అనిల్ ఓ వర్గంగా ఇక్కడ చక్రం తిప్పుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థ వివాదం విషయంలో అనిల్ కలుగ జేసుకున్నారని, అందుకే అది మరింత పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. గతంలో ఆనం జగన్‌పై విమర్శలు చేసినప్పుడు అనిల్ కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇక, కాకాని, ఆనం, ఆదాల ఒక వర్గంగా ఉంటూ.. అనిల్ వర్గంపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. కానీ, వీరి వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి.
ఇటీవల ఆనం.. ఇదే విషయంపై జగన్‌కు కూడా ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే, అంతా తనకు తెలుసునని అన్నారే తప్ప.. అనిల్‌ను జగన్ ఎక్కడా హెచ్చరించకపోవడం, కనీసం ఈ వివాదాలపై చర్చించక పోవడం గమనార్హం. ఇక, అనిల్ కుటుంబం కూడా స్థానికంగా దూకుడు పెంచిందని అంటున్నారు. కాంట్రాక్టులు, పనుల విషయంలో ఈ ఫ్యామిలీ జోక్యంపెరిగిందని చెబుతున్నారు. సో.. మంత్రి అనిల్ నెల్లూరును గుప్పిట పట్టారనే వాదనకు ఈ విషయాలు బలం చేకూరుస్తుండడం గమనార్హం.