వైఎస్సార్ సీపీలో ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలపై నాయకులు పట్టు పెంచుకునేందుకు తమకున్న అన్ని మార్గాలను అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకింత అలిగిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.. మౌనంవహించారు. తాను మంత్రే అయినప్పటికీ.. జిల్లాలోను, రాష్ట్రంలోనూ కూడా ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన చింతించారు. దీనికి కారణం.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ.. వి. విజయసాయిరెడ్డే. ఉత్తరాంధ్రజిల్లాల పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న సాయిరెడ్డి తనదూకుడు పెంచిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే విశాఖ సహా ఆ మూడు జిల్లాల్లోనూ తనదైన శైలిలో ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. దీంతో విశాఖ నుంచి మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా.. ఏదైనా కార్యక్రమం నిర్వహించినా.. కూడా సాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. నిజానికి కీలకమైన పాలనారాజధాని విశాఖకు వస్తుండడంతో అన్నీతనకనుసన్నల్లో జరగాలని, జరుగుతాయని అవంతి భావించారు. కానీ, సాయిరెడ్డి జోక్యంతో మంత్రిగా ఉన్నప్పటికీ.. అవంతి నెంబరు 2 గా మారిపోయారు. దీనిపై సోషల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇక, ఇప్పుడు సాయిరెడ్డికి కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరడం అవంతికి కలిసి వచ్చిందని అంటున్నారు.
సాయిరెడ్డి ఆసుపత్రిలో చేరిన తర్వాత నుంచి అవంతి జోరు పెంచారు. జిల్లాలో పూర్తిగా పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం మీడియాలో ఉంటున్నారు. తాడేపల్లి టు.. విశాఖ నిత్యం సర్వీసు చేస్తున్నారు. ప్రతి సమస్యను పట్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్నారు. కరోనా పై మరింత వేగంగా సమీక్షలు చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తున్నవారు.. అవంతి దూకుడు పెంచారని, పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే, రేపు సాయిరెడ్డి తిరిగి వచ్చాక ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందా? లేక అవంతి దూకుడుకు బ్రేకులు పడతాయా? అన్నది చూడాలి. ఇప్పటికైతే.. అవంతి జోరుమీదన్నట్టుగానే తెలుస్తోంది.