రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం – సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే కొత్త భవనాలను దశల వారీగా నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ లు తెలిపారు. అలాగే భవనాలు లేని పాత గ్రామ పంచాయతీల్లోనూ కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ లంబాడా తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ త్వరలోనే కొత్త భవనాలను నిర్మిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈ విషయమై నిధులు, విధి విధానాలు, ప్రణాళికలు వంటి పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో గురువారం చర్చించారు మంత్రి ఎర్రబెల్లి.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా జెడ్ చొంగ్తు, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో గ్రామ పంచాయతీ భవనాలు లేని తండాలు 1,0 97 ఉండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయని చెప్పారు. అలాగే 2,960 మైదాన ప్రాంత గ్రామ పంచాయతీల్లో భనవాలు లేవన్నారు. మొత్తం 4,745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల అవసరం ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి.