తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకన్నారు. 3 సంవత్సరాలు నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడితే 30 సంవత్సరాల వరకు మన కుటుంబానికి ఉపాధి కల్పిస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. కోతుల బెడద, జంతువుల నుంచి ఎలాంటి నష్టం ఉండదన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ మొక్కలకు అందిస్తూ సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తుందని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ఒక చెట్టుకు 12 నుంచి 18 గెలలు వస్తాయని, ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నర్సరీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్టీవో రమేష్, తహసీల్దార్ రాఘవరెడ్డిని మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ రెడ్డి, జీఎం సుధాకర్ రావు, జిల్లా కలెక్టర్ కే శశాంక, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, కాకిరాల హరి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, తదితరులు పాల్గొన్నారు.