నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇతర చోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వస్తున్న అసత్య ప్రచారాల్ని నమ్మవద్దని కోరారు. ప్రజలను అయోమయానికి గురిచేసేలా తప్పుడు ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని సూచించారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సోషల్ మీడియాతో ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా.. పాత రేషన్ కార్డులో తప్పొప్పులు ఉన్నా వాటిని సరిచేసుకోవాలంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆధార్ కార్డు, ఫొటో, ఆదాయ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ వంటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ వార్తలను విని ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు.