జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ బ్యాటిల్ కోసం సిద్ధం చేసుకున్న వాహనం వారాహి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారాహి వాహనానికి వేసిన రంగు పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా వైయస్సార్సిపి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి, సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ముందు ఏపీలో నా సినిమాలను ఆపేశారు. విశాఖలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు. నన్ను హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు. విశాఖ వదిలి వెళ్లమని పోలీసులతో బలవంత పెట్టించారు. మంగళగిరిలో నా కారు బయటకు రానివ్వలేదు. ఇప్పుడు నా వాహనం ‘వారాహి’రంగు సమస్య అంటున్నారు. అంటే నేను ఊపిరి పీల్చుకోవటం కూడా ఆపేయాలా? మరి ఇంక ఆ తరువాత ఏంటి..వాట్ నెక్ట్స్? అంటూ ప్రశ్నించారు ట్విట్టర్ వేదికగా జనసేనాని.
అంతేకాదు మరో ట్వీట్ లో పవన్ ‘వారాహి’వాహనం కలర్ షర్టును పోస్టు చేస్తు ఈ షర్టు వేసుకోవటానికి అనుమతి ఉందా? అంటూ వైసీపీపై సెటైర్ వేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్‌లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాహనం పేరు వారాహి కాదు నారాహి అని పెడితే సరిగ్గా సరిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేశ్. చంద్రబాబు దమ్మున్న మగాడు అయితే 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులే నిలబడతారు అని చెప్పమనండి అని సవాల్ విసిరారు జోగి రమేశ్. పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారని, నేనే అభ్యర్థిని అని చెప్పగలడా? అని జోగి రమేశ్ ప్రశ్నించారు. వీళ్ళంతా పగటి వేషగాళ్ళు, సిగ్గులేని వాళ్ళు…. చరిత్రలో ధీరుడుగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.