కేంద్ర సర్కార్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి రాష్ట్ర మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవరు లేరు అని అన్నారు. మోదీ గ్రేట్ పీఎం కాదని ఫేక్ పీఎం అని పేర్కొన్నారు. ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి పాలైతుందని సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు ఫేక్ ఆడియో కాల్ సృష్టించి బీజేపీ చిల్లర ప్రయత్నాలు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. “మీ బతుకే ఒక ఫేక్ బతుకు. ప్రధానికి మించిన ఫేక్ ఇంకెవరు లేరు ఈ దేశంలో. ప్రధాని నరేంద్ర మోదీ ఈజ్ బిగ్గెస్ట్ ఫేక్ ఇన్ ఎంటైర్ కంట్రీ. యువతకు ఉద్యోగాలిస్తాని చెప్పి.. అత్యధిక నిరుద్యోగం సృష్టించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఫేక్ పార్టీ, ఫేక్ నాయకులు పిచ్చి వేషాలు వేస్తే చాలా కాలం జైల్లో మగ్గాల్సి వస్తుంది. అల్రెడీ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాం. మా సహనాన్ని పరీక్షించొద్దు.” అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
“ఫేక్ ఆడియోలు, వీడియోలను నమ్మొద్దు. విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోవాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని కేటీఆర్ పేర్కొన్నారు.