రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు శనివారం ప్రతికా ప్రకటన విడుదల చేశారు. పేదల పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసు అంటూ ధ్వజమెత్తారు. పేదవాడి పొట్టకొట్టేందుకు కేంద్రం కొత్త పాచిక ఈ ఉచిత పథకాలపై చర్చ అని విమర్శించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటీ?.. బడుగు బలహీన వర్గాల ప్రజలే మీ టార్గెటా?.. పేదలకు ఇస్తే ఉచితాలా?.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అంటూ ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా?, రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా?.. అని ఆరోపించారు. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్‌కు పన్నురాయితీనా? అని నిలదీశారు. మోదీ ప్రభుత్వం రూ.80లక్షలకోట్ల అప్పు తెచ్చిందని, ఈ అప్పు తెచ్చి ఎవరిని ఉద్దరించారని ప్రశ్నించారు. దేశ సంపదను పెంచే తెలివి మోదీ ప్రభుత్వానికి లేదని, సంపద పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు లేదన్నారు.
ఓ వైపు పాలు, పెరుగులాంటి నిత్యావసరాలపై జీఎస్టీ పెంచి కేంద్రం ప్రజల రక్తాన్ని జలగల్లా జర్రుకుంటోందని, మరో వైపు పేదల నోటికాడి లాగేసే దుర్మార్గానికి తెగించిందంటూ మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరిందని, నైజీరియా కన్నా ఎక్కువమంది పేలున్న దేశంగా అపకీర్తి గడించామన్నారు. ఆకలి సూచీలో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నామని, దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5శాతం పోషకాహార లోపంతో పెరుగుదల సరిగాలేదని కేంద్రం విడుదలచేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు.