విశ్వనగరంగా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే.. రోజు రోజు హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులో వచ్చింది. ఎస్సార్‌డీపీ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్‌గా నిలబెట్టాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచన అన్నారు. ఎస్సార్‌డీపీ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అన్నారు మంత్రి కేటీఆర్. ‘ముఖ్యమంత్రి ఆలోచనల్లో నుంచి 2014లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక మంచి విశ్వనగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. ఇక్కడ ప్రజ అవసరాలకు, నగర విస్తరణకు, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని ఆలోచనతో సీఎం నడుం బిగించి ఎస్సార్‌డీపీ కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అప్పగించారు.
మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా శిల్పా ఫ్లైఓవర్‌తో కలిసి 33 కార్యక్రమాలను ఆరేళ్లలో పూర్తి చేశామని సగర్వంగా చెబుతున్నా’నన్నారు మంత్రి కేటీఆర్. ‘పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు తిరుగుతు ఉంటాను.. ఇతర నగరాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారంతా చెప్పే మాటక ఒకటే.. హైదరాబాద్‌లో ఉన్నంత అత్యుత్తమంగా మౌలిక వసతులు ఈ దేశంలో ఏ నగరంలో లేదని చెబుతున్నారు. ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ కానీ, పుణేకు వెళ్లినా.. ఇలాంటి అత్యుత్తమ మౌలిక వసతులు భారతదేశంలో ఏ నగరంలో లేవు అని.. మనది మనం కితాబిచ్చుకోవడం కాదు.. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, జాతీయ ప్రముఖులు చెబుతున్న మాట. పరిశ్రమలు, ఐటీ రంగం విస్తృతంగా పెరగడంతో ప్రతిఏటా లక్షల మంది హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి స్థిరపడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్.