ఆ భాగ్యం నాకే దక్కింది : మంత్రి కేటీఆర్‌

-

సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడికి వచ్చే ముందు సంతోషం అనుభవించే సందర్భం ఎదురైంది. కుంభాల మల్లారెడ్డి ఒక మంచి పని చేసి వాళ్ల ఊరికి పిలిచిండు. కేసీఆర్‌ దళితబంధు విప్లవాత్మకమైన పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పైలెట్‌ నియోజకవర్గంగా 18వేల యూనిట్లు ప్రకటించి ఇప్పటికే దాదాపు 38వేల యూనిట్లు రూ.4వేలకోట్లు దళితబంధు కింద విడుదల చేశాం. సిరిసిల్లలో అమలు చేసే సమయంలో దళితబంధు అంటే కార్లు కొనుడు, టాక్సీలు నడుపుడు కాదు రూ.10లక్షల ఇస్తే వాటిని పదింతలు చేసే సత్తా మాకుందని చూపే సోదరులను పట్టుకోవాలని అనుకున్నాం.

ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో విజయ్‌కుమార్‌, డప్పుల లింగయ్య, సుదమల్ల రాజేశ్వరి రూ.30లక్షలతో బ్యాంకు లోను తీసుకొని.. ప్రభుత్వం ద్వారా సబ్సిడీలతో రూ.3కోట్లతో అద్భుతమైన రైస్‌మిల్‌ను కట్టి ఇవాళ నాతోని ప్రారంభింపజేశారు. సంతోషం ఎక్కడ అనిపించిందంటే ఆ రైస్‌ మిల్‌కు నేనే భూమిపూజ చేశాను. ఇవాళ ప్రారంభోత్సవం చేసే అదృష్టం, భాగ్యంనాకే దక్కింది. అక్కడకుపోయి చూసి కండ్లకు నీళ్లచ్చినయ్‌. గుండె సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అంటే వారికి అయాచితంగా సాయం చేస్తున్నట్లు, చాతకాని వాళ్లకు ఉదారంగా ఇస్తున్నట్లు బిల్డప్‌లు ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం. వాళ్లు కూడా సంపద సృష్టించి సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడి.. ఇతరులకు ఉపాధి కల్పించే సత్తా ఉన్నదని అక్కడకు పోయినప్పుడు గర్వంగా, గొప్పగా అనిపించింది’ అని కేటీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version