తెలంగాణలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఇప్పటి నుంచే ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీల బలోపేతానికి కృషి చేస్తున్నాయి. అయితే.. తాజాగా టీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతలను పార్టీ వదులుకోదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పార్టీకి సీనియర్ల అవసరం ఉందన్న కేటీఆర్.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను పార్టీ వదులుకోదని కూడా స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్…ఖమ్మంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆయన తుమ్మల, పొంగులేటిల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చెప్పిన కేటీఆర్… ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. సిట్టింగులందరికీ సీట్లు వస్తాయని అనుకోవడం సరికాదని కూడా కేటీఆర్ వెల్లడించారు. ప్రజల్లోకి టీఆర్‌ఎస్ పార్టీని తీసుకెళ్లేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.