విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి ఔట్ : మంత్రి సవిత

-

సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమశాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి సవిత కలెక్టర్ తోనూ. బీసీ సంక్షేమ శాఖాధికారులతోనూ ఫోన్లో మాట్లాడారు. సీకే పల్లి బాలుర హాస్టల్ లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని మంత్రి ఆరా తీశారు.

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదని మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులకు భోజనం సదుపాయం కల్పించాలని, రాత్రికి కూడా ఎటువంటి లోటూ రానివ్వొద్దని స్పష్టంచేశారు. విద్యార్థులను ఆకలితో బాధపడేలా చేసిన సీకే పల్లి బీసీ బాలుర హాస్టల్ హెచ్ డబ్ల్యూవో నారాయణ స్వామిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఫోన్లో కలెక్టర్ ను మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ టీఎస్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి వివరాలు అందివ్వాలన్నారు. అధికారులపై నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారని, వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, సహించేది లేదని, అవసరమైతే అటువంటి హెచ్ డబ్ల్యూవోలను, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news