ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుతమైన ఘట్టం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

-

2567వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ది బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్‌ ప్రాంగణంలో బౌద్ధ పీస్‌ కార్‌ ర్యాలీ ని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్‌లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. అంతేకాకుండా.. ‘ఈ సారి బుద్ధ జయంతి కి ఓ ప్రత్యేకత ఉంది. ఓ వైపు సాక్షాత్తు మహనీయుడు 125 అడుగుల బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం, మరో వైపు అంబేద్కర్‌ సచివాలయం. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుతమైన ఘట్టమ’ని అన్నారు. గౌతమబుద్ధుడు, మహాత్యాజ్యోతిరావు పూలేలను ఆదర్శంగా తీసుకొని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించారన్నారు. నాగార్జునుడు నివసించిన పవిత్రమైన ప్రాంతం తెలంగాణ అని గుర్తు చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద బుద్ధవనాన్ని ఇక్కడ నిర్మించుకున్నామన్నారు.

తెలంగాణలో ఎక్కడ తవ్వకాలు జరిగినా అక్కడ బౌద్ధ స్థూపాలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రకు గుర్తింపునిచ్చారని, కవులు, కళాకారులు, మహనీయులకు ప్రాధాన్యత కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జి. పరందాములు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ సతీశ్‌, జి. రాజేశ్వర్‌ రావు, అశోక్‌ భాగ్యవన్‌, సుదర్శన్‌, సలహాదారులు చింతా శ్రీరామమూర్తి, కేకే రాజా, రావుల అంజయ్య, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version