సచివాలయాల ద్వారా 3.64 కోట్ల సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి విడదల రజిని. తమ ప్రభుత్వం పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలకు సాక్ష్యమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులో మంగళవారం గడపగడప కార్యక్రమానికి మంత్రి విడదల రజిని గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ జగనన్న ఆలోచనలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతున్నదని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలు అత్యంత వేగంగా, సులభంగా, నాణ్యమైన ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. ఒక్క వంకాయలపాడు సచివాలయం పరిధిలోనే కేవలం మూడున్నరేళ్లలో నాలుగువేలకుపైగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించగలిగామంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15004 సచివాలయ ద్వారా ప్రజలకు ఇంకెంత మేలు జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గోన్నారు.