టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూపురం నియోజక వర్గం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కనబడటం లేదంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు పట్టణంలోని వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ తో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కూడా కనబడడం లేదని వారు ఫిర్యాదులో చెప్పారు.
ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా… హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ.. వీరిలో ఏ ఒక్కరూ కూడా ఎందుకు స్పందించడం లేదని వారు నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా వారంతా బయటకు వచ్చి.. వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి.. హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని స్థానిక బీజేపీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.