ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో త‌డ‌బాటు

-

రోజుకో వ్యూహంతో చెల‌రేగుతున్న ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హారంతో టీడీపీ అధినేత , ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ త‌డ‌బ‌డుతోందా? ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంటోందా? అంటే .. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుని, సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌గా మారారు సీఎం జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ జ‌గ‌న్‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అనేక ఉద్య‌మాలు, నిర‌స‌న‌ల‌కు పిలుపునివ్వ‌డం, పార్టీ అదినేత చంద్ర‌బాబు స్వ‌యంగా ఆయా ఆందోళ‌న‌ల‌లో పాలు పంచుకోవ‌డం తెలిసిందే.

అయితే, చంద్ర‌బాబు వ్యూహాల‌కు అడుగ‌డుగునా ఇబ్బందులు వస్తున్నాయి. ఆయ‌న ఒక వ్యూహం వేస్తే.. దానికి దీటుగా అధికార పార్టీ మ‌రో వ్యూహంతో బాబుపై పైచేయి సాధిస్తోంది. దీంతో చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంలో క్లారిటీ మిస్స‌యి.. నానా తిప్పులు ప‌డుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట తెలుగు మాధ్య‌మం ఎత్తివేత‌పై చంద్ర‌బాబు ఆందోళ‌న‌కు దిగారు. అదేస‌మ‌యంలో ఇసుక కొర‌త‌, కార్మికుల ఇబ్బందుల‌పై దీక్ష‌కు దిగారు. క‌చ్చితంగా అదే రోజు.. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ ని వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని మీడియా ముందుకు తీసుకు వ‌చ్చింది.

దీంతో బాబు ఇసుక దీక్ష సైడ్ ట్రాక్ ప‌ట్టింది. ఇక‌, తాజాగా.. రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు త‌న ప‌రివారంతో క‌లిసి యాగీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న రాజ‌ధానిలో ప‌ర్య‌టించారు. అయితే, ఇదే అదునుగా జ‌గ‌న్ దెబ్బేసేశారు. టీడీపీకి చెందిన గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆయ‌న మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌తో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లిసి..అనంత‌రం మీడియా ముందుకు వ‌చ్చి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

రాజ‌ధానిని ఐదేళ్ల‌లో డెవ‌ల‌ప్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ప‌రిస్థితి ఉండ‌దు క‌దా! అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌, ఆయన జ‌గ‌న్‌పైనా, ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు ప‌క్క‌దారి ప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీలోనే ప్ర‌ధానంగా చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ దూకుడు వైసీపీ వ్యూహాల ముందు ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ త‌డ‌బ‌డుతోంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి దీనిని చంద్ర‌బాబు దీటుగా ఎలా ఎదుర్కొంటారో చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version