జీఓలు ఎన్నయినా రావొచ్చు. కొన్నింటిని వెనక్కు తీసుకుంటారు. కొన్నింటిని యథాతథంగా అమలు చేసేందుకు కృషి చేస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పంథాలో సాగిపోతున్న జగన్ నిన్నటి వేళ ఓ జీఓ ఇచ్చారు. ఆ జీఓ కాపీలో ఇంగ్లీషు స్పెల్లింగులను దిద్దే పని మళ్లీ పెట్టుకున్నారు యంత్రాంగం తరఫు మనుషులు. అంత బాగున్న జీఓ కాపీని ఆఖరికి దిద్ది, భాషను సంస్కరిస్తే కానీ సవరించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. ఇదీ మన నాయకుల చిత్తశుద్ధి.
జిల్లాల పునర్విభజనపై అంతటా చర్చ నడుస్తున్న తరుణాన అసలు జీఓ కాపీ ఏ విధంగా ఉందో చూడాలి అని అనుకుంటే మీరు దొరికిపోయినట్లే! ఎందుకంటే ఆ జీఓలో వందకు పైగా తప్పులున్నాయి. ఉంటే ఉండనీ అనుకుని అధికారులు రిలాక్స్ అయిపోతున్న తరుణంలో ఉన్నతాధికారుల అప్రమత్తత కారణంగా తప్పులు దిద్ది సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వివాదం తాత్కాలికంగా సమసిపోయింది.
ఆంధ్రావనిలో జీఓల విడుదలకు సంబంధించి ఎటువంటి కసరత్తూ లేకుండా పోతోందని తేలిపోయింది. ముఖ్యమయిన జీఓల విడుదల సమయంలో కూడా కనీస శ్రద్ధ తీసుకోవడం లేదని స్పష్టం అయిపోయింది. దీంతో జగన్ సర్కారులో పనిచేస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి వేళ జిల్లాల పునర్విభజనకు సంబంధించి జీఓ విడుదల సందర్భంగా ఎన్నో తప్పులు దొర్లాయి. వందకు పైగా తప్పిదాలు ఉన్నాయని గుర్తించారు. జిల్లాల పేర్లను రాసేటప్పుడు స్థానిక వ్యవహారంలో ఉన్నస్పెల్లింగులనే రాయాలి. కానీ జగన్ ఇచ్చిన జీఓలో ఆ విధంగా లేకపోవడంతో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత వాటిని దిద్దుతూ సవరించిన ఉత్తర్వులు ఇచ్చారు.
13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీఓలో నెల్లూరు జిల్లాపేరు తప్పుగా రాశారు. అదేవిధంగా కడప జిల్లా పేరు కూడా తప్పుగానే రాశారు. ఎన్పీఎస్ జిల్లాగా నెల్లూరు జిల్లా పేరు రాసి తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారని, కడప జిల్లా పేరు వైఎస్సార్ కడప జిల్లాగా పేర్కొనగా తరువాత వైఎస్సార్ జిల్లా అని దిద్దారు అని ప్రధాన మీడియా చెబుతోంది.
ఒక ముఖ్యమయిన జీఓ విడుదలలో అధికారులు అస్సలు శ్రద్ధ వహించలేదనే తేలిపోయింది. ఇప్పటికే పాలనకు సంబంధించి పట్టు లేదని, అధికార యంత్రాంగం అస్సలు దృష్టి పెట్టి పనిచేయడం లేదన్న వాదనకు ఇలాంటి పనులు తప్పక ఊతం ఇస్తాయి.