కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. చాలా తక్కువ రోజుల వ్యవధిలోనే ఈ యాప్‌ను కొన్ని కోట్ల మంది ఇప్పటికే తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అయితే మొదట్లో ఈ యాప్‌పై ఓ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ యాప్ లో ఉన్న లోపాల కారణంగా వినియోగదారుల డేటాకు ముప్పు పొంచి ఉందని చెప్పాడు. అయితే కేంద్రం అవన్నీ అబద్దాలే అని కొట్టి పారేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ యాప్‌పై వివాదం చెలరేగుతోంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆరోగ్య సేతు యాప్‌ను రివ్యూ చేసి గతంలో 2 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడే రేటింగ్‌ను ఆ కాలేజీ 1కు తగ్గించింది. ఎందుకంటే ఆ యాప్ వినియోగదారుల ఫోన్లలో అవసరానికి మించిన డేటాను సేకరిస్తున్నదట. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం సేఫ్ కాదని చెబుతున్నారు.
ఆరోగ్య సేతు యాప్ వినియోగదారుల ఫోన్లలో అవసరానికి మించి డేటాను కలెక్ట్ చేస్తుందని ఎంఐటీ అభిప్రాయ పడింది. అలాగే కరోనా వచ్చిన వారు, రానివారు దగ్గర దగ్గరగా ఉంటే.. వారిలో ఎవరికి కరోనా ఉంది, ఎవరికి లేదు.. అనే విషయాన్ని కూడా ఈ యాప్ సరిగ్గా గుర్తించలేకపోయిందట. ఉదాహరణకు.. ఒక భవనంలో కరోనా వచ్చిన వారు, రాని వారు ఒకే దగ్గర ఉన్నారనుకుంటే.. వారిలో ఎవరికి ఇన్‌ఫెక్షన్ ఉంది, ఎవరికి లేదు అనే విషయాన్ని ఈ యాప్ సరిగ్గా చెప్పలేకపోతుందట. దీంతోపాటు కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఫోన్లలో యూజర్లకు చెందిన డేటాను అవసరం లేకున్నా ఈ యాప్ కలెక్ట్ చేస్తుందట. కనుక ఈ యాప్‌ను వాడుతున్న వారు ఈ విషయంపై మరోసారి ఆలోచన చేయాలని ఎంఐటీ చెబుతోంది. ఇక ఈ యాప్‌ను ప్రజలు కచ్చితంగా వాడాలని భారత ప్రభుత్వం బలవంత పెడుతుందని, మిగిలిన దేశాల్లోనూ ఈ తరహా యాప్‌లు ఉన్నా.. అక్కడ ఇలా కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌లను వాడాలని ప్రజలను బలవంత పెట్టడం లేదని.. ఎంఐటీ తెలిపింది.
కాగా ఇప్పటికే విమానాలు, రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాలని కేంద్రం సూచనలు జారీ చేసిన విషయం విదితమే. అయితే ప్రయాణికులు తమకు ఇష్టం ఉంటేనే ఈ యాప్‌ను వాడాలని తరువాత పలువురు అధికారులు వివరణ ఇచ్చారు. కానీ ఈ యాప్ వాడకంపై ఇప్పటికీ అనేక మందిలో ఇంకా సందేహాలు నెలకొన్నాయి.