మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. వెంకట్రామి రెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారనే వివాదం ఉంది. వరి విత్తనాలను అమ్మకాలు చేపడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో వెంకట్రామి రెడ్డి అన్నారు. హై కోర్టు, సుప్రీం కోర్టుల నుంచి ఉత్తర్వులను తెచ్చుకున్నా.. తాము పట్టించుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దూమారాన్ని లేపాయి.
రైతులు, ప్రతి పక్ష పార్టీల నేతలు.. వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలాగే వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలో మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.
తనకు న్యాయ స్థానాలు అంటే గౌరవం ఉందని అన్నారు. న్యాయ స్థానాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కొందరు తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారని ఆరోపించారు. కాగ వెంకట్రామి రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఆయన పై ఉన్న పిటిషన్ పై విచారణను హై కోర్టు ముగించింది.