ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయ్యి తిహార్ జైలు నుంచి విడుదలయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా నిజామాబాద్ పర్యటనకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృతంగా ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద, అనంతరం డిచ్పల్లి వద్ద ఘనంగా స్వాగతం పలకనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత నేరుగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లను సైతం గులాబీ నేతలు ఏర్పాటు చేశారు.