హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. కరోనా మహమ్మారి ప్రబలిన కారణంగా నిలిపివేయబడిన హైదరాబాద్ మహానగరంలోని ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఎంఎంటీఎస్ సేవలు హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న దిగువ, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు, విద్యార్థులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇంకా వివిధ రంగాల వారికి గత కొన్ని ఏళ్లుగా అత్యంత చవకైన సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
అయితే కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం మొదట్లో నిలిపివేయబడిన సేవలు, ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకొని కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల సౌకర్యార్థం పునః ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారు.. కచ్చితంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని కూడా దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని.. ప్రయాణం చేయాలని సూచనలు చేసింది.