కరోనా లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని షాపులు, మాల్స్, స్టోర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు అసలు ఏమీ జరగలేదని, ఫోన్ల విక్రయాలు సున్నాగా నమోదయ్యాయని ఆ రంగానికి చెందిన విక్రయదారులు చెబుతున్నారు. ఫోన్ల తయారీ పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోవడం, దుకాణాలు మూసివేసి ఉండడం, ఈ-కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసరాలను మాత్రమే డెలివరీ చేస్తుండడంతో ఏప్రిల్ నెలలో ఫోన్ల విక్రయాలు అసలు జరగలేదు. దీంతో వాటి అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయని రిటెయిలర్లు చెబుతున్నారు.
భారత్‌లో మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీతో రెండో విడత లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇక మార్చిలో ఫోన్ల అమ్మకాలు తక్కువగా నమోదు కాగా, ఏప్రిల్‌లో అసలు విక్రయాలు జరగలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఫోన్లను అమ్ముకునేందుకు అనుమతివ్వడంతో.. ఫోన్ల తయారీదారులు కొంత ఊపిరి పీల్చుకోనున్నారు. ఈ క్రమంలో మే 3వ తేదీ అనంతరం దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు మళ్లీ ఫోన్లను విక్రయించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే సాధారణంగా ప్రతి నెలా 1.1 నుంచి 1.2 కోట్ల ఫోన్ల అమ్మకాలు మన దేశంలో జరుగుతాయి. ఎక్కువగా షియోమీ, శాంసంగ్, రియల్‌మి ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేస్తారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో ఫోన్ల అమ్మకాలు జరగలేదు. ఇక లాక్‌డౌన్ పూర్తిగా ముగిసి, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఈ-కామర్స్ సంస్థల ద్వారానే ఫోన్లను అమ్మాలని ఆయా తయారీ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆఫ్‌లైన్ స్టోర్ల నిర్వాహకుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..!