ఇది కరోనా కాలం.. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న కాలం.. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి అత్యంత దయణీయంగా మారిన కాలం.. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలి.. వీలైతే ఎంతోకొంత సాయం చేయాలి.. మేమున్నాం అన్న భరోసా కల్పించాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు తోడుంటున్నాయి కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధమైన పనులు చేస్తుంది.
ప్రజలకు ఈ సమయంలో సాయం చేయడం సంగతేమో కానీ, ప్రజల నుంచే వీలైనంత దండుకునే పని పుష్కలంగా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా… వరసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. జూన్ ఏడో తేదీన మొదలుఎప్ట్టిన బాదుడు.. ఏ చిన్న విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. అంతర్జాయంగా బ్యారెల్ క్రూడ్ ధర 20 డాలర్లకు పడిపోయినా కూడా మోడీ ప్రభుత్వం మాత్రం పెంపుదలలో వెనక్కి తగ్గడం లేదు. ఈ వరుస బాదుడులో భాగంగా ఈ 18 రోజుల్లో పెట్రోల్ మీద లీటర్ కు రూ.8.5, డీజిల్ ధర లీటర్ కు రూ.10.5 పెంచేసింది.
లక్ష్యం రౌండ్ ఫిగర్ అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. ఇదే వేగంతో పెంచుకుంటూ పోతే మాత్రం పెట్రోల్ లీటర్ కు వంద రూపాయలు చేరే రోజు ఇంకో ఇరవై రోజుల్లోనే రావచ్చు! అంతర్జాతీయంగా పెట్రో ధరలు నేల చూపుల చూస్తున్న దశలో కూడా మనదేశంలో మాత్రం ఆకాశంవైపు చూస్తున్నాయంటే.. కరోనా కష్టాలను సామాన్యుడి నుంచే తీర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనుకోవడంలో తప్పులేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు!