మోదీ మెచ్చిన అన్నదాత

-

హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. సంప్రదాయ పద్దతుల్లో వెంకట్‌ రెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని ప్రశంసించారు. విటమిన్‌-డీ కలిగిన అరుదైన వరి, గోధుమ పంటలను పండించి సాగులో వెంకట్ రెడ్డి సృష్టించిన అద్భుతాలను మోదీ వివరించారు. వెంకటరెడ్డి పండించిన పంటకు జెనీవాలోని ప్రపంచ మేధో హక్కుల సంస్థ.. పేటెంట్ హక్కులు కూడా ఇచ్చిందని మోదీ తెలిపారు. అలాంటి వ్యక్తికి గత ఏడాది పద్మ శ్రీ పురస్కారం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన గౌరవమని ప్రధాని కొనియాడారు.

వెంకట్ రెడ్డి

ఆలోచన ఎలా వచ్చిందంటే..
వెంకట్ రెడ్డి డాక్టర్‌ను కలిసినప్పుడు శరీరంలో విటమిన్‌-డీ తక్కువగా ఉండటంవల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించారట. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆ రైతు ఆలోచించారు. అప్పుడే విటమిన్‌-డీ కలిగిన వరిని పండించాలనే ఆలోచన తట్టింది. అప్పుడే ఈ విధానానికి నాంది పలికారు. దీనికి వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఆమోదం కూడా లభించింది.

మందులు వాడాల్సిన పనిలేదు..
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి క్యారెట్, స్వీట్ పోటాటో, మక్కపిండితో చేసిన మిశ్రమాన్ని.. పంటకు నీళ్లలో కలిపి విటమిన్-డీ ఉన్న పంటను పండించారు. విటమిన్-డీ లోపం ఉన్నవారు.. మందులు వాడకుండా ఈ ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాన్ని ఈ రైతు ప్రపంచానికి పరిచయం చేశారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితంమవటంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

దేశవ్యాప్తంగా అమలు చేసేలా శ్రమించాలి..
వెంకట్ రెడ్డి సాగు గురించి ప్రధాని ప్రశంసించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశానికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలా చేయటం వల్ల మంచి ఆదాయం లభించటంతో పాటు దేశం నుంచి వరి, గోధుమ ఎగుమతులు పెరుగుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version