Monkey Pox Negative : కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగిటివ్

-

తెలంగాణలో మంకీపాక్స్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని స్పష్టం చేసింది. పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు అతడి శాంపిల్స్ ను పంపినట్లు తెలిపింది. పరీక్షించిన వైద్యులు.. నెగిటివ్ గా నిర్ధరించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు మంకీపాక్స్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్‌ లక్షణాలున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ నెల 6న అతను కువైట్‌ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్‌ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్‌ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. అతని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. పుణె వైద్యులు అతడికి మంకీపాక్స్ సోకలేదని తేల్చారు.

కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ సోకనప్పటికీ.. ఇతర దేశాల నుంచి వస్తోన్న వారిపై నిఘా ఉంచుతామని వైద్యశాఖ వెల్లడించింది. ముందస్తు అప్రమత్తతో మంకీపాక్స్ మహమ్మారిని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూస్తామని భరోసానిచ్చింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశమున్నందున పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version